విశ్వాసానికి మారుపేరైన శునకాలపై మనుషులు అమానవీయంగా ప్రవర్తిస్తున్న ఉదంతం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. మూగజీవాల రక్తాన్ని వ్యాపారం(Dog blood business) గా మార్చుకుంటూ, వాటి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి(Private veterinary hospital) ఉదంతం నగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. షేక్‌పేటలోని ఓ ప్రైవేట్ పశువైద్యశాల వేదికగా సాగుతున్న ఈ రక్త పిపాసి వ్యాపారంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
Also Read : హైకోర్టును ఆశ్రయించిన నటి ఆషురెడ్డి.. ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలంటూ…
Blood Of Stray Dogs
ఈ దారుణం వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం ఆ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది బయటపెట్టిన ఫోటోలు, వీడియోలు. దీనిపై స్పందించిన జంతు హక్కుల ఉద్యమకర్త మేనకాగాంధీ, రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఆసుపత్రి నిర్వాహకులు వీధి కుక్క(stray-dogs) లను సంరక్షణ పేరుతో తీసుకువచ్చి, వాటిని ఇనుప బోన్లలో బంధిస్తారు. చికిత్స కోసం వచ్చే పెంపుడు కుక్కల యజమానులే వీరి ప్రధాన లక్ష్యం. అనారోగ్యంతో వచ్చే శునకాలకు అవసరం లేకపోయినా రక్త పరీక్షలు నిర్వహించి, వాటికి రక్తహీనత ఉన్నట్లు తప్పుడు నివేదికలు సృష్టించి యజమానులను భయాందోళనకు గురిచేస్తారు.
రక్తం ఎక్కించకపోతే ప్రాణాలు పోతాయని వైద్యులే యజమానులను ఒప్పించి, తాము బోన్లలో పెంచుతున్న కుక్కల నుంచి రక్తం సేకరిస్తారు. ఇలా సేకరించిన ఒక్కో రక్తపు ప్యాకెట్‌ను రూ. 18,000 నుంచి రూ. 25,000 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిరంతరం రక్తం తీయడం వల్ల ఆరోగ్యంగా ఉన్న వీధి కుక్కలు రక్తహీనతతో ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీధి కుక్కల రక్తం సరిపోకపోతే, చికిత్స కోసం వచ్చిన ఇతర పెంపుడు కుక్కల నుంచి కూడా యజమానులకు తెలియకుండా రక్తం తీస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నిజానికి పశువైద్య నిబంధనల ప్రకారం.. ఒక మూగజీవికి రక్తం ఎక్కించాల్సి వస్తే, ఆరోగ్యంగా ఉన్న మరో జంతువు యజమాని సమ్మతితోనే రక్తమార్పిడి జరగాలి. కానీ నగరంలో సరైన ‘బ్లడ్ బ్యాంక్’ సౌకర్యం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఇటువంటి అక్రమ వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ఈ వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ పశువైద్యాధికారులు మరియు జంతు సంక్షేమ బోర్డు అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. దోషులుగా తేలితే ఆసుపత్రి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన నగరంలోని పెంపుడు జంతువుల యజమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read : అమెరికా గడ్డపై తెలుగు తేజం… హారిస్ స్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా తీపిరెడ్డి సింధూజ







